సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది.
రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు. చంద్రబాబు నిర్వహిస్తోన్న ఈ సభలు.. టీడీపీ- జనసేన మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలకు అద్దంపడుతున్నాయి. పలు అంశాలపై ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏకాభిప్రాయానికి రావట్లేదు. అభ్యర్థుల ప్రకటన, సీట్ల పంపకాల వ్యవహారంలో చోటు చేసుకుంటోన్న జాప్యం ఈ పరిణామాలకు దారి తీస్తోంది.
గ్రామస్థాయిలో కలిసి మెలిసి పని చేయాల్సిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు కొట్లాటకు దిగుతున్నారు. ఒకరినొకరు కుమ్మేసుకుంటోన్నారు. టీడీపీ- జనసేన మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం పట్ల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.
గతంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన మధ్య ఏర్పాటైన ఆత్మీయ సమావేశాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులు ఘర్షణ పడ్డారు. పెద్ద ఎత్తున వాగ్వివాదానికి దిగారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో అలాంటి వాతావరణమే ఏర్పడింది.
పవన్ కల్యాణ్ సీఎం అని నినాదం చేసినందుకే టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులపై దాడి!
గంగాధర నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరిమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ సీఎం అని నినాదం చేసినందుకే టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులపై దాడికి దిగారని చెబుతున్నారు. ఈ ఘర్షణ వల్ల సభ మొత్తం రసాభాసగా మారింది. రణరంగంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ కిందపడ్డాయి. రెండు పార్టీల జెండాలను నేలపై చెల్లాచెదురు అయ్యాయి.
కింది స్థాయి కార్యకర్తల్లో ఇంకా సమన్వయం లేక ఒకరిమీద ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో దానిని చక్కబెట్టుకోకుండా ఇరు పార్టీలు ఎన్నికలకు వెళ్లడం అనేది మూర్ఖపు చర్యగా భావించొచ్చు వీళ్ళ మధ్య సరైన అవగాహనా లేకుండా కూటమిగా కలిసినట్టు నటిస్తూ బలంగా ఉన్నా అధికార వైసీపీని ఎంతవరకు ఎదుర్కుంటారో చూడాలి!