Geetanjali: జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన ఈ మహిళ చనిపోయిందా.. అసలేం జరిగింది?

సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ మహిళ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇల్లు వస్తుందని అనుకోలేదని, స్టేజ్ మీద పట్టా తీసుకుంటానని అస్సలు అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయారు. ఆ సంతోషంలో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆమె మాట్లాడిన మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈమె ఇప్పుడు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అసలు ఏం జరిగిందంటే..?

గీతాంజలి ఎవరు?

తెనాలిలోని ఇస్లాం పేటలో ఉంటారు గీతాంజలి దేవి. వయసు 29 ఏళ్లు. ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని సంబరపడిపోయారు గీతాంజలి దేవి. అదే క్రమంలో తనను మాట్లాడించిన ఓ మీడియా ఛానెల్ ఎదుట తన సంతోషం వ్యక్తం చేశారు.

” సొంత ఇల్లు నా కల. ఇన్ని రోజులకు నెరవేరింది. నా పేరు మీద ఇంటి స్థలం పట్టా వచ్చింది. ఏ డబ్బులు కట్టకుండానే నాకు ఇంటి స్థలం వచ్చింది. మాకు అమ్మ ఒడి వస్తోంది. మా మామయ్యకు పింఛన్ వస్తోంది. మా అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్న గెలవడం ఖాయం” అంటూ గీతాంజలి తన సంతోషం వ్యక్తం చేశారు.

అయితే గీతాంజలి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె సంతోషంగా చెప్పిన మాటలు గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ గీతాంజలి దేవి ఇప్పుడు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని సమాాచారం.

అయితే ..గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందనీ.. దానిని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఆ మహిళ ఆనందం.. అంతలోనే విషాదంగా మారటంపై సోషల్ మీడియా నెటిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment