టికెట్స్ పొందినా వాళ్ళు వైసీపికి రాజీనామాలు…దేనికి సంకేతం?

ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు, టికెట్స్ ఇస్తున్నా పలువురు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుండటం గమనిస్తే, త్వరలో జరుగబోయే ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోబోతోందని వారు గట్టిగా నమ్ముతున్నట్లనిపిస్తుంది. వారు పార్టీ వీడటానికి వేరే కారణాలు చెప్పుకున్నప్పటికీ అసలు కారణం మునిగిపోయే వైసీపి నౌకలో నుంచి బయటకు దూకి తమ రాజకీయ జీవితాలను కాపాడుకోవాలనే భావించవచ్చు.

తాజాగా వైసీపి రాజ్యసభ సభ్యుడు, పార్టీలో చాలా సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా పార్టీకి, టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిద్దరూ త్వరలో టిడిపిలో చేరబోతున్నట్లు సమాచారం. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకి ఈసారి తిరుపతి శాసనసభ టికెట్‌ ఖరారు చేస్తే ఆయన పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయారు. నర్సాపురం వైసీపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్‌ కోరితే ఆయన కూడా పదవికి, పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈసారి నెల్లూరు నుంచి లోక్‌సభ అభ్యర్ధిగా జగన్‌ ఖరారు చేశారు. కానీ ప్రభాకర్ రెడ్డికి టికెట్‌ ఇచ్చినప్పటికీ పార్టీకి, పదవికి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకే చెందిన ముగ్గురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి)లను పార్టీ నుంచి బయటకు పంపేశారు. నెల్లూరు (అర్బన్) ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ని ఈసారి నర్సరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేయిస్తుండటంతో ఆయన నెల్లూరు వదిలి వచ్చేశారు.

ఇప్పుడు జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో నెల్లూరు జిల్లాలో వైసీపి మరింత బలహీనపడింది. పార్టీ టికెట్స్ కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. కానీ టికెట్స్ ఇస్తున్నా వైసీపిని వీడి వెళ్ళిపోతున్నారంటే అర్దం ఎన్నికలలో ఓడిపోబోతోందని గట్టిగా నమ్ముతుండటం వలననే కదా?

Leave a Comment