సీఎం జగన్‌పై ఆగంతకుడి దాడి!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది.

బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్‌ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్‌ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్‌ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. 

ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళికతోనే.. 

సీఎం వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్‌ డాబా కొట్ల సెంటర్‌లోని వివేకానంద స్కూల్‌ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు.

తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్‌ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్‌ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్‌ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు.

ఎయిర్‌ గన్‌ వినియోగించారా.. 

సీఎం జగన్‌పై ఎయిర్‌ గన్‌ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్‌ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్‌ గన్‌నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్‌ బాల్‌ను వినియోగించారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సిద్ధం సభలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగాయి. ఈ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సైతం రాష్ట్ర ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నా పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా వెల్లువలా సీఎం జగన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఆదరణను తట్టుకోలేక.. ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపైన హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చలించని సీఎం… యథాతథంగా యాత్ర కొనసాగింపు 

తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ సీఎం జగన్‌ ఏమాత్రం వెరవలేదు. వాహనంలోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే ఆయన మళ్లీ వాహనం పైభాగానికి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కొట్ల జంక్షన్‌ నుంచి కృష్ణా హోటల్‌ సెంటర్, పైపుల రోడ్, ప్రకాశ్‌ నగర్, పాయకాపురం, కండ్రిగ, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి వరకు అంటే 20 కి.మీ. వరకు యాత్రను కొనసాగించారు. శనివారం రాత్రి కేసరపల్లిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రాత్రి బస చేశారు.  

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స..  

సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్‌ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్‌ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్రై్కబ్‌ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరించారు.

ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్‌ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్‌ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్‌ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు.  

నేడు యాత్రకు విరామం 

యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్‌ జగన్‌కు లోకల్‌ అనస్తీషియా ఇచ్చి… కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్‌ తిరిగి తన నైట్‌ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు 

సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్‌ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్‌ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తాం. 
     –కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌   

Leave a Comment