ముద్రగడతో పవన్ భేటీ ఖాయం!

గోదావరి జిల్లాలకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతి పండుగ అయిన తరువాత ఈ నెల 20 లేదా 23 తేదిలలో పవన్ ముద్రగడ తొలి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీ కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోనే ఆయనను కలుసుకుంటారు అని జనసేన వర్గాలు తెలిపాయి.

ముద్రగడ జనసేనలో చేరికకు సుముఖంగా ఉన్నారు అని వార్తలు వచ్చాయి. ఇక గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో ఇప్పటికే కలసి చర్చించారు. ఆ తర్వాత ఆ విషయం పవన్ కళ్యాణ్ తోనూ చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ముద్రగడ కలసి మూడు రోజుల క్రితం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ భేటీ తరువాత మంచి ముహూర్తం చూసుకుని ముద్రగడ జనసేన పార్టీ ఆఫీసులో తన అనుచరులతో కలసి ఆ పార్టీలో చేరుతారని అంటున్నారు.

ముద్రగడ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన 2024 ఎన్నికలతో రీ ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు నిజం కాబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ముద్రగడ కాకినాడ పార్లమెంట్ నుంచి లేదా పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయవచ్చు. అదే విధంగా ఆయన కుమారుడు ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తారు. ఇక ముద్రగడ సన్నిహితులకు కూడా కొన్ని టికెట్లు ఇప్పించుకునే అవకాశం ఉంది.

ముద్రగడ జనసేనలో చేరడం అంటే గోదావరి జిల్లాలలో కీలకమైన పరిణామంగానే చూస్తున్నారు. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆయన తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా ప్రస్తుతం ఉన్న పార్టీల నుంచి కాకుండా జనసేన నుంచి.

ఈ భేటీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Comment