ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల సమరానికి సై అంటున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో రెండు పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్.
మొదటి లిస్ట్ లో సుమారు 70 మంది అభ్యర్థులు పేర్లు విడుదల
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 02న టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్పీడ్ పెంచారు టీడీపీ-జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కల్యాణ్. రా కదలి రా.. సభలకు నాలుగు రోజులు విరామం ఇచ్చిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ టైమ్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటి రెండ్రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇంకా పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఆ తర్వాత జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించే విషయంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రెండు దఫాలుగా భేటీ అయిన ఇద్దరు నేతలు మూడోసారి మీటింగ్ తర్వాత చివరి నిర్ణయానికి రానున్నారు.
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు రా కదలి రా.. సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు. అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నాలుగో తేదీ నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు.
ఈలోపే మొదటి లిస్టు విడుదల చేయాలని రెండు పార్టీల వారు భావిస్తున్నారు.ఇక వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు స్పీడ్ చేశారు రెండు పార్టీల అగ్రనేతలు. పూర్తిస్థాయి కసరత్తు తర్వాత ఇద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసేందుకు ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు.
టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థుల జాబితాతో పాటు మ్యానిఫెస్టో విషయంలో స్పీడ్ పెరగడంతో రెండు పార్టీల నేతల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.