చంద్రబాబు- కేశినేని గ్యాప్ మొదలు అక్కడే

టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి

పార్టీలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న కేశినేని నాని పార్టీ వీడారు. ఇది ఇప్పటికే తెలిసిన విషయమే అయినా వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్నారు. జగన్ వేవ్ లోనూ టీడీపీ నుంచి గెలిచిన నాని ఇప్పుడు పార్టీ ఎందుకు వద్దనుకున్నారు. నానినే పార్టీ వీడారా..నానినే పార్టీ వీడేలా చంద్రబాబు చేసారా. అసలు ఈ ఇద్దరి మధ్య ఈ రోజుది కాదు. దీని వెనుక చాలా పెద్ద కధే ఉంది. రెండు సార్లు ఎంపీగా గెలిచి సామాజిక వర్గం..స్థానికంగా మంచి అండ ఉన్న కేశినేని నాని టీడీపీ వీడి వైసీపీలో చేరటం ఇప్పుడు ఆ పార్టీకి భారీ నష్టం ఖాయంగా కనిపిస్తోంది.

ఎంపీగా గెలిచిన సమయం నుంచి అవినీతికి అవకాశం లేకుండా రాజకీయం

కేశినేని నాని 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలుపొందారు. తొలి సారి నుంచి ఎంపీగా గెలిచిన సమయం నుంచి అవినీతికి అవకాశం లేకుండా పార్టీలో సమస్యలు ఉన్నా..తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నా నాని తన పని తాను చేసుకుపోయారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు, ఆ తరువాత బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగించారు. వారితో సాన్నిహిత్యంతో విజయవాడలో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసం వినియోగించుకున్నారు. రెండో సారి 2019 ఎన్నికల సమయంలోనే నానికి సీటు ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేదు. అప్పటికే నాని బీజేపీ ముఖ్యులతో సన్నిహితంగా ఉండటం చంద్రబాబుకు రుచించలేదు. కానీ, ఎన్డీఏ నుంచి బయటకు రావటం సరి కాదంటూ అప్పట్లోనే నాని వాదించారు. జయదేవ్ తో ప్రధానిని ఉద్దేశించి మిస్టర్ పీఎం అంటూ చేయించిన వ్యాఖ్యలు సరి కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాల బలంగా పని చేసాయనేది నాని విశ్లేషణ.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపికలో వివాదం

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు ఎంపీ జయదేవ్ కు అవకాశం ఇచ్చారు. దీనిని నాని వ్యతిరేకించారు. కమ్మ వర్గానికి కాకుండా రామ్మోహన్ నాయుడుకు ఇవ్వాలని నాని సూచించారు. కానీ, చంద్రబాబు అంగీకరించలేదు. అధికారం కోల్పోయిన తరువాత అయినా ఇతర వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. ఇక..విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ గెలిచేలా తాను బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. కానీ, పార్టీలో కొందరిని నాని పైన వ్యతిరేకంగా ముఖ్య నేతలు ప్రోత్సహించారు. ఫలితంగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ నేతలు రోడ్డున పడ్డారు. తన సోదరుడితో ఉన్న విభేదాలను తనకు వ్యతిరేకంగా పార్టీ అనుకూలంగా మలచుకోవటం నాని జీర్ణించుకోలేకపోయారు. తమ విభేదాలపైన చర్చలకు వ్యూహకర్త రాబిన్ శర్మను పంపటం పై ఆగ్రహించారు.

పార్టీ లో ప్రాధాన్యత తగ్గించిన చంద్రబాబు – మనస్థాపం

కొంత కాలంగా తన సోదరుడినే తన స్థానంలో సీటు ఇస్తామంటూ ప్రచారం చేయటం నాని మనస్థాపానికి కారణమైంది. దీంతో, ఇక పార్టీలో ఉండలేమని డిసైడ్ అయ్యారు. తాను చంద్రబాబును వద్దనుకోలేదని, చంద్రబాబే తనను వద్దనుకున్నారని నాని స్పష్టం చేసారు. ఇప్పటికే ఒక ఎంపీ జయదేవ్ దూరం కాగా.. ఇప్పుడు నాని పార్టీ వీడటంతో ఎన్నికల సమయంలో టీడీపీ కేడర్ లో అసలేం జరుగుతోందనే డైలమా మొదలైంది.

Leave a Comment