ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలో బకాయిలన్నింటినీ విడుదల చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యమిస్తూనే వస్తోన్నారు. సామరస్యపూరకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావట్లేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటోన్నారు.

అన్ని శాఖలు, విభాగాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు, సెలవులు, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లు అవి. వాటిని పరిష్కరించాలంటూ సుదీర్ఘకాలంగా ఆందోళనలు సాగిస్తోన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వ ఇదివరకు కూడా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి ఇందులో పాల్గొన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల జేఏసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఛైర్మన్ బండి శ్రీనివాసరావు సహా 13 ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు వారి మధ్య చర్చలు సాగాయి.

ఇవి ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. చర్చల సారాంశాన్ని వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలన్నింటిపైనా చర్చించామని అన్నారు. సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు.

వీలైనంత త్వరగా పీఆర్‌సీని ప్రకటించాలని భావిస్తున్నామని వివరించారు. ఇప్పటికే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఈ నెలలో లేదా వచ్చే నెల నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని అన్నారు.

దీనికోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమౌతాయని, ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోన్నందు వల్ల ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి బొత్స చెప్పారు. విశాఖపట్నంలో మరణించిన ఎమ్మార్వో కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.

Leave a Comment